Telugu Gateway
Politics

ఆర్టీసీ చర్చలు విఫలం

ఆర్టీసీ చర్చలు విఫలం
X

తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్టీసి సమ్మెకు ప్రస్తుతానికి ముగింపు పడే సూచనలు కన్పించటంలేదు. ఆర్టీసి అధికారులతో కార్మిక సంఘ నేతలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తాము లేవనెత్తిన డిమాండ్లు కాకుండా అధికారులు ఓ ఏజెండా తయారు చేసుకుని వచ్చి దాని ప్రకారమే ముందుకు సాగాలని కోరారని..ఇది ఏ మాత్రం సమ్మతం కాదని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. చర్చలకు వచ్చిన తమ ఫోన్లు కూడా లాక్కున్నారని ఆరోపించారు. ఎంతో నిర్భంధకాండతో చర్చలకు పిలిచారని..ఇది ఎక్కడా కూడాలేదని జెఏసీ నేతలు సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను మార్చి చెప్పారని తెలిపారు. కేవలం కోర్టులో చెప్పుకోవటం కోసం ఇద్దరు అధికారులతో చర్చలు జరిపారు తప్ప..అధికారుల్లో చిత్తశుద్ధి కన్పించటంలేదని జెఏసీ నేతలు ఆరోపించారు.జెఏసీ మాత్రం తాము లేవనెత్తిన డిమాండ్లపై చర్చ జరపాలని పట్టుపట్టింది. చర్చలు జరగకుండానే సమ్మె విరమించాలని కోరారని తెలిపారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్వత్థామరెడ్డి సమ్మె ఆగదని తెలిపారు.

అన్ని సంఘాలు ఇఛ్చిన డిమాండ్లను కలిపి 26 డిమాండ్లుగా మార్చామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అయితే యాజమాన్యం మాత్రం అందుకు సిద్దంగా లేదన్నారు. తమ చర్చల వీడియో రికార్డు కూడా చేశారని..ఇది కోర్టుకు సమర్పిస్తే ఎవరి తప్పు ఉందో తెలుస్తుందని అన్నారు. అయితే ప్రభుత్వం చర్చలకు ఎప్పుడు పిలిచినా వస్తామని..చర్చలు జరిపి ఎవి సాధ్యం అవుతుందో...ఏవి సాధ్యం కావో చెప్పినా మాట్లాడటానికి రెడీగా ఉన్నామని తెలిపారు. సహజంగా ఎప్పుడైనా చర్చల్లో యూనియన్లు వాకౌట్ చేస్తాయని..కానీ ఈ సారి అధికారులే వాకౌట్ చేసి వెళ్లిపోయారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. వాళ్లు వస్తారేమో అని ఐదు నిమిషాలు వెయిట్ చేసి టీ తాగి వచ్చామని తెలిపారు. ఇలాంటి చర్చలు ఆర్టీసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు.

Next Story
Share it