Telugu Gateway
Andhra Pradesh

‘రౌడీ గవర్నమెంట్’ ఇది..చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

‘రౌడీ గవర్నమెంట్’ ఇది..చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. అంత ఆనందంగా ఉంటే వెళ్ళి వైసీపీలో చేరాలని వ్యాఖ్యానించారు. గురువారం నాడు విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన ఆయన పలు సమావేశాల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మొదటిసారి రౌడీ గవర్నమెంట్ ను చూస్తున్నా. టీడీపీకి ప్రతిపక్ష పాత్ర కొత్త ఏమీ కాదు. కష్టాలు వచ్చాయి, కేసులు పెడుతున్నారు. మూడోసారి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం సీఎం గా, ప్రతిపక్ష నేతగా నేనె చేశా. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. మొదటిసారి రౌడీ గవర్నమెంట్ ను చూస్తున్నా.. నేరస్తులు పాలన చేస్తున్నారు. వైఎస్ వున్నప్పుడు నేను అసెంబ్లీ లో గట్టిగా మాట్లాడితే రాజశేఖరరెడ్డి భయపడేవాడు. కానీ వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. మంచికి మంచిగా ఉంటా. తమాషాలు చేస్తే ఊరుకోను. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీకి దొంగ లెక్కలు రాసుకోవడమే తెలుసు.’ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం నిలిచిపోయిందన్నారు.

గ్రామ సచివాలయాలకు వాళ్ల పార్టీ కలర్‌ వేశారని, ఇక స్మశానాలకు కూడా పార్టీ రంగులేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుసా.. దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే తెలుసని ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు. భవిష్యత్తులో టీడీపీని గుర్తుపెట్టుకునేలా పునాదులు వేయాలన్నదే లక్ష్యమన్నారు. మంచిగా ఉంటే బాగుంటుంది. తమాషాలు చేయాలని చూస్తే సాధ్యం కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసినప్పుడల్లా సంతోషం కలుగుతుందని. హైదరాబాద్ నగరంగానీ, విశాఖ ఎయిర్‌పోర్టు, విశాఖ నగరంలో చేసిన అభివృద్ధి చూసినప్పుడు ఆనందం కలుగుతుందని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంను తొక్కి పెట్టాలని చూస్తే ఇంకా రెచ్చిపోతారు తప్పితే, అణిగి పోరని చంద్రబాబు అన్నారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతి ఒక్కరి జాతకాలు తనకు తెలుసునని అన్నారు.

Next Story
Share it