Telugu Gateway
Politics

ప్రజలు ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొట్టడం ఖాయం

ప్రజలు ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొట్టడం ఖాయం
X

సీఎం కెసీఆర్ అధికార నివాసం...క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బైక్ పై వచ్చి ప్రగతి భవన్ ముట్టడిలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదివారం రాత్రి నుంచి కన్పించకుండా పోయిన రేవంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా...రేవంత్ రెడ్డి నేరుగా ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్బంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రజలు రేపు ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టడం ఖాయం. నిర్భంద పోకడలు కాదు. ఆర్టీసి కార్మికులతో చర్చలు జరపాలి. చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు స్వేచ్చ కోరుకుంటున్నారు.’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ప్రగతి భవన్ దగ్గరకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, సీఎం కెసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో కూడా ఈ అంశంపై స్పందించారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కెసిఆర్ ఖబడ్ధార్ అంటూ కామెంట్ చేశారు. అంజన్ యాదవ్ , రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆటోలో ప్రగతి భవన్ కు వచ్చారు. పోలీసులు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ లు చేయటంతో పాటు..ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్..పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. బేగంపేట మెట్రో స్టేషన్ ను మూసివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ముట్టడి కారణంగా పంజాగుట్ట-సికింద్రాబాద్ మార్గంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ తో ప్రజలు..ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Next Story
Share it