Telugu Gateway
Andhra Pradesh

విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా

విజయసాయిరెడ్డిపై వంద కోట్ల  పరువు నష్టం దావా
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయాలని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. మీడియాను అడ్డంపెట్టకుని రవిప్రకాష్ అక్రమంగా భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని..నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ వీటిపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ గోగోయ్ కు విజయసాయిరెడ్డి తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఫెమా, ఆర్‌బీఐ రెగ్యులేషన్స్‌, మనీలాండరింగ్‌తోపాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. మొయిన్‌ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి చాలా మందిని మోసం చేశారని, సానా సతీష్, మొయిన్ ఖురేషి, రవిప్రకాష్ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాల్లో సిటీ కేబుల్‌లో రవిప్రకాష్‌ పెట్టుబడులు పెట్టారని, రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితా, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను చీఫ్ జస్టిస్‌కు విజయసాయి లేఖలో తెలిపారు.

ఏబీసీఎల్‌ సంస్థలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు, మెఘా కృష్ణా రెడ్డి ద్వయం ఈ నీచమయిన ఆరోపణలు చేయిస్తోందని రవిప్రకాష్ కార్యాలయం ఆరోపించింది. నెలక్రితం ఇవే అసత్య ఆరోపణలు రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రామారావు అనే వ్యక్తితో లిఖితపూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఇప్పుడు అవే ఆరోపణలు పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్నారని రవిప్రకాష్ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోపణలు కేవలం గాలి కబుర్లేనని ఇప్పటికే అధికారులు నిర్ధారించారని అయినా రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపి విజయ సాయి రెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్ పై పంపించారని తెలిపింది. ఈ కట్టుకథలు వెనుక ఈ పెద్దలే ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోందని పేర్కొంది.

Next Story
Share it