‘రాజుగారి గది3’ మూవీ రివ్యూ
హారర్ సినిమాలను ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. ఈ జోనర్ కు భారీ మార్కెట్ కూడా ఉంది. రాజుగారి గది సినిమా స్వీకెల్ లో ఇది మూడవది. దర్శకుడు ఓంకార్ ఈ సిరీస్ ను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అందులో భాగంగానే రాజుగారి గది3 సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాయ (అవిక్ గోర్) డాక్టర్. ఆమెకు చాలా మంది ఐ లవ్ యూ చెబుతారు. అలా ఆమెకు ఐ లవ్ యూ అని చెప్పిన వారందరినీ ఓ దెయ్యం చితకబాదుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. తనకు ఎవరు ఐ లవ్ యూ చెప్పినా మాయ మాత్రం తక్షణమే అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని హెచ్చరిస్తుంది. హీరో అశ్విన్ ఆటోనడుపుకుంటూ ఓ కాలనీలో నిత్యం పెద్ద న్యూసెన్స్ చేస్తూ ఉంటాడు. ఎలా ఇతని గొడవ తప్పించుకుందామా అని కాలనీ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అశ్విన్ కు ఎన్ని సంబంధాలు వచ్చినా చెడగొడుతూ ఉంటారు. ఓ సారి అశ్విన్ మాయను రౌడీల నుంచి కాపాడతాడు. ఆ పరిచయం అలా కొనసాగుతుండగా..మాయ పనిచేసే ఆస్పత్రిలో పనిచేసే సీనియర్ డాక్టర్ అయిన బ్రహ్మజీ ఎలాగైనా అశ్విన్, మాయల మధ్య ప్రేమ కలిగేలా చేస్తే తమకు తలనొప్పి వదులుతుందని అనుకుని ఆ రకంగా ప్లాన్ చేస్తారు.
అలాగే అశ్విన్ మాయకు ఐ లవ్ యూ చెబుతాడు. మరి అశ్విన్ ను దెయ్యం వెంబడించిందా?..వీళ్ళ ప్రేమ ఫలించిందా అన్నదే సినిమా. అసలు మాయకు ఎవరు ఐ లవ్ యూ చెప్పినా వాళ్ళను దెయ్యం వెంటబడి తరమటానికి గల కారణాన్ని వెల్లడించే సందర్భాన్ని దర్శకుడు ఓంకార్ ‘లింక్’ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్ర యూనిట్ ముందు చెప్పినట్లుగానే ఈ సినిమా హారర్ కంటే కామెడీనే డామినేట్ చేస్తుంది. అసలు సినిమా అంతా సెకండాఫ్ లో నే సాగుతుంది. రాజుగారి గది3లో అవికా గోర్, అశ్విన్ బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సెకండాఫ్ లో అజయ్ ఘోష్, ఊర్వశి, అలీ, ధన్ రాజ్ ల పాత్రలు ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు మరీ ఎబ్బెట్టుగా ఉన్నా ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా సరదా సరదాగా సాగిపోతుంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. సినిమాలో సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కానీ...ఓవరాల్ గా రాజుగారి గది సిరీస్ లో భాగంగా ఓంకార్ కు మరో హిట్ వచ్చిందనే చెప్పొచ్చు.
రేటింగ్. 2.5/5