Telugu Gateway
Telangana

భయపెడుతున్న ప్రకాష్ నగర్ మెట్రో గోడ పగుళ్ళు

భయపెడుతున్న ప్రకాష్ నగర్ మెట్రో గోడ పగుళ్ళు
X

ఓ వైపు హైదరాబాద్ మెట్రో సక్సెస్ ఆనందం. మరో వైపు నిర్మాణలోపాల టెన్షన్ మరో వైపు. ముఖ్యంగా అమీర్ పేట మెట్రోస్టేషన్ లో పెచ్చులు ఊడిపడి ఓ యువతి మరణించటం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. దేశంలోని ఎంతో పేరు ఉన్న నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో పనుల్లో నిర్మాణ లోపాలు తలెత్తటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. అమీర్ పేట ఘటన తర్వాత అధికారులు కొంత హడావుడి చేసినా అది తాత్కాలికమే అన్న అభిప్రాయం కన్పిస్తోంది. తాజాగా బేగంపేట సమీపంలో ప్రకాష్ నగర్ దగ్గర మెట్రో స్టేషన్ గోడకు పెద్ద ఎత్తున పగుళ్ళు రావటం కలకలం రేపుతోంది.

దీనికి సంబంధించిన ఫోటోలను నల్లమోతు శ్రీధర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రాలను హెచ్ఎంఆర్ తోపాటు..జీహెచ్ఎంసీకి కూడా ట్యాగ్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. తాజా పరిణామాలతో మెట్రోలో ప్రయాణించే వారు కూడా నిత్యం భయంతో వణికిపోవాల్సి వస్తోంది. అయితే ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పగుళ్ళకు సంబంధించి అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ప్రయాణికులు లోపాలను గుర్తించటం కాకుండా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తనిఖీలు సరిగా నిర్వహించి ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత నిర్వహణ సంస్థపై ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it