Top
Telugu Gateway

రేవంత్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

రేవంత్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు
X

ప్రగతి భవన్ ముట్టడి వ్యవహారం హైదరాబాద్ లో పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఆందోళన కారులు ఎవరూ సీఎం నివాసం, క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ వైపు రాకుండా పోలీసులు భారీ బందో బస్త్ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఏకంగా బేగంపేట మెట్రో స్టేషన్ ను కూడా బంద్ చేశారు. ఎందుకంటే నిరసనకారులు మెట్రోలో వచ్చి ప్రగతి భవన్ కు చేరుకుంటారనే భయంతో ఈ పనిచేశారు. దీంతో బేగంపేటలో మెట్రో స్టాఫ్ లేకుండా చేసినట్లు అయింది సోమవారం రోజు. ఆర్టీసి సమ్మె వ్యవహరంలో ముఖ్యమంత్రి కెసీఆర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.

చాలా వరకూ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులకు చిక్కకుండా ఉండటంతో ఆయన ఏ మార్గం నుంచి ప్రగతి భవన్ వైపు వస్తారా? అనే టెన్షన్ పోలీసుల్లో నెలకొంది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి నుంచే రేవంత్ రెడ్డి కన్పించకుండా పోవటంతో ఆయన సన్నిహితులతోపాటు..హోటళ్ళలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు వి హనుమంతరావు, షబ్బీర్ అలీ, హనుమంతరావు, కోమటిరెడ్డి బ్రదర్స్ అందుబాటులో లేరని సమాచారం. సోమవారం సాయంత్రంలోపు వీళ్ళు ఏ మార్గంలో అయినా ప్రగతి భవన్ చేరుకోగలుగుతారా? లేక పోలీసులకు చిక్కుతారా అన్నసస్పెన్స్ నెలకొంది.

Next Story
Share it