ఆర్టీసి ఉద్యోగుల తొలగింపుపై పవన్ ఆందోళన

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చర్చల ద్వారానే ఇరుపక్షాలు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటం ఆందోళనకర పరిణామంగా పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్.టి.సి. సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని కెసీఆర్ కు సూచించారు పవన్ కళ్యాణ్.