కూలీలకు పని కూడా లేకుండా చేస్తారా?
ఓ వైపు కొత్త ఉద్యోగాలు అంటూ వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ అవకాశాలు ఇచ్చుకుంటారు. మరి కూలీలకు పని లేకుండా ఎందుకు చేస్తున్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇసుక విధానం ఖరారులో ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది రోడ్డున పడ్డారని ఆరోపించారు. వీరికి అండగా నిలిచేందుకే జనసేన నవంబర్ 3న విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ పెట్టినట్లు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన గురువారం నాడు అమరావతిలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం అయ్యారు. "దేశంలో లక్షల కోట్లు దోపిడి చేసే వ్యవస్థలు ఉన్నాయిగానీ అందరికీ నిలువ నీడ కల్పించే ఒక భవన నిర్మాణ కార్మికుడికి రక్షణ కల్పించే పరిస్థితులు లేవు. విదేశాల్లో కార్మికుల రక్షణకు ఎన్నో బలమైన చట్టాలు ఉంటాయి. మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా నిలిచేందుకు, మీ బరువు పంచుకునేందుకు జనసేన పార్టీ ఉంది. మీకు పెద్దన్నయ్య గా అండగా నిలుస్తా. నవంబర్ 3వ తేదీ విశాఖ నిరసన యాత్ర ద్వారా అంతా కలసి ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి తీసుకువద్దాం.’ అని తెలిపారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన వెంటనే ఇసుక మీద సమీక్ష సమావేశం పెట్టారు. 3వ తేదీ నిరసనని పక్కదోవ పట్టించేందుకు ఏదో ఒక ప్రకటన చేస్తారు.
మద్దతుగా తరలివచ్చే వారిని పోలీసు వ్యవస్థతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట ఇసుక విధానం వల్ల 19 లక్షల మందిని రోడ్డున పడ్డారని ఆరోపించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... "పది లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వంలో ఉన్నవారు వెటకారాలు చేయడం సరికాదు. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఇసుక ఇస్తారా?. మీరు ఇసుక ఇచ్చినప్పుడు ప్రజలను ఇళ్ళు కట్టుకోమంటారా? అని ప్రశ్నించారు. ఒకసారి వర్షాలు వచ్చాయంటారు. కొత్త విధానం కాబట్టి ఇంకా సమయం పడుతుంది అంటారు. ఎవరు పెట్టుకున్న ముహుర్తానికి వారు ఇల్లు కట్టుకుంటారు గానీ, మంత్రి చెప్పిన ముహుర్తానికి ఇల్లు కట్టుకోవడం కుదరదన్న విషయం గ్రహించాలి. ఇసుక సమస్య మీద రాష్ట్ర స్థాయిలో అందరినీ కదిలించే విధంగా విశాఖపట్నంలో కార్యక్రమం చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. సమస్య తీవ్రత ప్రభుత్వానికి తెలియచేయడమే లక్ష్యం. మీ కోసం నేను నడుస్తాను అని స్వయంగా పార్టీ అధ్యక్షులే ముందుకు వచ్చారు. మీ తరఫున అన్ని రకాలుగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు" అని అన్నారు.