Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ పై వైసీపీ మండిపాటు

పవన్ కళ్యాణ్ పై వైసీపీ మండిపాటు
X

కేసులు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ మండి పడింది. ఆర్ధిక నేరగాళ్ళు వల్ల అందరూ భయపడాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ విమర్శలపై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశారని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జగన్‌ బాధ్యత అని అంబటి పేర్కొన్నారు. ఈ విషయం మరిచిపోయిన పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుతో కుమ్మక్కై బరితెగించి సీఎంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

జగన్‌పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని, వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్‌ కల్యాణ్‌కు ఈ సంగతి తెలియదా అంటూ అంబటి ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో వలసల గురించి ప్రశ్నించే ముందు తన పార్టీలో జరుగుతున్న వలసలను ఆపుకోవాలని ఎద్దేవా చేశారు. రెండోచోట్ల పవన్‌ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఆయన ఓడిపోయిన చోట ఇప్పటివరకూ మొహం చూపించలేదన్నారు. ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌కు వైఎస్‌ జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కుందా అంటూ అంబటి ప్రశ్నించారు. చెప్పుడు మాటలు వినకుండా సొంతంగా పార్టీ నడిపిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లయినా సంపాదించుకోగలుగుతారని సూచించారు.

Next Story
Share it