జనసేన నుంచి మరో వికెట్ ఔట్

జనసేన నుంచి మరో వికెట్ పడింది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు పలువురు బయటకు వెళ్ళటం ప్రారంభించారు. ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్ కోసం వేరేదారులు వెతుక్కుంటున్నారు. ఇటీవలే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గాజువాకలోనూ ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కూడా జనసేనకు గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
తాను గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలతో పాలు పంచుకుంటూ అయిదేళ్లుగా శాసనసభ్యుడిగా పని చేసి... ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నాను. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన అన్నారు.