Telugu Gateway
Politics

కొత్త ఉద్యోగాలిస్తాన్న కెసీఆర్..ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా?

కొత్త ఉద్యోగాలిస్తాన్న కెసీఆర్..ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా?
X

తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. తర్వాత అసలు ప్రభుత్వం ఎంత?. దాని పరిమితి ఎంత?. ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు సాధ్యమైతతా అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసీఆర్ తనను తానే ప్రశ్నించుకున్నారు. మరి అంతకు ముందు చెప్పిన మాటల సంగతి ఏంటి? అని అసెంబ్లీలో అడిగేవారే లేకుండా చేసుకున్నారు. ఇదంతా పాత కథ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సర్కారు కొన్ని నోటిఫికేషన్లు అయితే ఇఛ్చింది. కానీ చాలా వరకూ కోర్టు కేసుల్లోనే నానుతున్నాయి. తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కెసీఆర్ ఇప్పుడు ఏకంగా 50 వేల కుటుంబాలను రోడ్డున పడేస్తారా?. ఆర్టీసి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పుడే సమ్మె చేస్తే ఆర్టీసి మూసేస్తా అని హెచ్చరించారు. ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు కొత్తగా పండగ సమయంలో సమ్మె చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు నోటీసు ఇఛ్చినప్పుడే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకూ వచ్చేది కాదు కదా?. కార్మిక సంఘాలు డిమాండ్ చేసే వాటిలో ఆమోదించదగ్గది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదా? అన్నీ అసంబద్ధ డిమాండ్లేనా?.. ఓ కార్పొరేషన్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయగలరా?. అంటే బ్లాక్ మెయిల్ చేసే తప్పు ప్రభుత్వం ఏమి చేసింది?. తప్పు చేసిన వాళ్ళనే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయగలరు?. లేదంటే ప్రభుత్వాన్ని అందునా కెసీఆర్ సర్కారు బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా?. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికి పెద్ద అయిన సీఎం ప్రజారవాణాలో దేశంలో ఎంతో పేరుగాంచిన సంస్థ ఉద్యోగ సంఘాల నేతలతో అసలు మాట్లాడటానికే ఇష్టపడకపోవటం వెనక కారణం ఏంటి?.

కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రో..లేక కనీసం మంత్రుల కమిటీనో చర్చించి కొన్ని డిమాండ్లను ఆమోదించి...ఆర్ధిక పరిస్థితిని వివరించి కొంత సమయం అడిగినా కూడా కాదని కార్మిక సంఘాలు మొండిగా సమ్మెకు వెళితే వాళ్లే ప్రజలకు జవాబుదారి అయ్యే వారు. కానీ సర్కారు నుంచి ఆ దిశగా కనీస చొరవ కూడా కన్పించలేదు. ఐఏఎస్ ల కమిటీ నిత్యం సమయం కావాలని కోరటమే తప్ప..నిర్ధిష్ట హామీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అంతే సమ్మె కు వెళ్ళారని..శనివారం రాత్రి వరకూ విధుల్లో చేరని వారి ఉధ్యోగాలు అన్నీ పోయినట్లే అంటే అంత తేలిగ్గా అయిపోతుందా?. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు..ఆర్టీసి కార్మికుల సేవలను ఎంతగానో ఉపయోగించుకున్న కెసీఆర్ వాళ్లకు ఇచ్చే బహుమతి ఇదేనా?.

Next Story
Share it