స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ కావాలి
జనసేన స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది. ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచుతూ రాజకీయంగా కూడా తన శక్తిని కూడగట్టుకునే పనిలో పడింది. అందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ నేతలతో జనసేన అధినేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీలు అవుతున్నారు. “పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా త్వరలో గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ నుంచి బరిలోకి దిగిన అభ్యర్ధులు, అసెంబ్లీ నియోజకవర్గాల తరఫున బరిలోకి దిగిన అభ్యర్ధులు, అక్కడ ఉన్న నాయకులను గుర్తించి ఇన్ ఛార్జ్ లుగా నియమించిన తర్వాత వారం రోజుల్లో ఈ కమిటీల నియామక ప్రక్రియను పార్టీ ముందుకు తీసుకువెళ్లబోతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి జనసైనికుడు సిద్ధమవ్వాలని మనోహర్ సూచించారు. నిత్యం ప్రజల తరఫున నిలబడే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం వాగ్దానాలు నిలబెట్టుకుంటుందా.? లేదా? ఓటు వేసిన పేదలకు అండగా నిలబడిందా లేదా అన్న అంశం మీద 100 రోజుల పాలనలో వైసిపి వైఫల్యాలపై అధ్యయనం చేసి మీడియా ముఖంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది.ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కొరత, కరెంటు కోతలు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తీసివేత తదితర అన్ని సమస్యలపై నిత్యం పవన్ కళ్యాణ్ సమీక్షిస్తూనే ఉన్నారు. అన్ని సమస్యల మీద చర్చించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ శ్రేణులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ప్రజల కోసం పోరాటం చేసేందుకు ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటిని గుర్తించి గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలు ప్రజలు గుర్తించేలా ఉండాలి. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో నిరసన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా” అన్నారు.