నియంత ప్రభుత్వాలు ప్రజల ఆవేశం చూస్తాయి
ఆర్టీసి సమ్మెకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. నియంత ప్రభుత్వాల ప్రజల ఆవేశానికి గురి కాకతప్పదని అన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఉద్దేశపూర్వక ప్రత్యామ్నాయ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటంతో వారిన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని జగన్ సూచించారు. డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. కార్మికులపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన విమర్శించారు.