మంచు మనోజ్ సంచలన ప్రకటన
మంచు మనోజ్. గత కొంత కాలంగా కొత్త సినిమాలు ఏమీ లేవు. ఆయన గురించి పెద్దగా వార్తలు లేవు. సడన్ గా ఆయన గురువారం నాడు సంచలన ప్రకటన చేశాడు. తన వివాహ బంధానికి బ్రేకప్ చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. అందులోని ముఖ్యాంశాలు...‘నా వ్యక్తిగత జీవితం, కేరీర్ సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మేమిద్దరం కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగింది. మా మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో.. చాలా ఆలోచించి కష్టమైనప్పటికీ ఎవరి దారి వాళ్లు చూసుకోని ముందకు సాగాలని నిర్ణయించుకున్నాం.
మేమిద్దరం విడిపోయినప్పటికీ..మాకు ఒకరిపై మరోకరికి గౌరవం అలాగే ఉంటుంది. మీరందరు కూడా ఈ నిర్ణయాన్ని మద్దతుగా నిలిచి మా ప్రైవసీని గౌరవిస్తారని భావిస్తున్నాను. కొంతకాలంగా నా మనసు బాగోకపోవడంతో.. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. అలాగే సినిమాల్లో నటించలేకపోయాను. ఈ సమయంలో నా కుటుంబం చాలా అండంగా నిలిచింది. వారు నా వెంట లేకపోతే ఈ కష్ట సమయాన్ని అధిగమించలేకపోయేవాడిని. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక పని సినిమాల్లో నటించడం.. అందుకోసం నేను తిరిగొచ్చాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల వల్లే. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి’ అని మనోజ్ తెలిపారు. 2015లో మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది.