Telugu Gateway
Politics

పాక్ కు మరో షాక్

పాక్ కు మరో షాక్
X

పాకిస్థాన్ కు వరస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అంతర్జాతీయంగా కాశ్మీర్ అంశంతోపాటు పలు అంశాలపై ఆ దేశం అభాసు పాలవుతోంది. తాజాగా అలాంటిదో మరో షాక్ తగిలింది. అదే సమయంలో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో విజయం దక్కింది. 35 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్ల (రూ 300 కోట్ల) విలువైన హైదరాబాద్ నిజాం ఆస్తులకు సంబంధించిన హక్కులపై భారత్‌ వాదనను బ్రిటన్‌ హైకోర్టు సమర్ధించింది. 70 ఏళ్ల కిందటి ఈ కేసులో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో లండన్‌లోని నేషనల్‌ వెస్ట్‌ మినిస్టర్‌ బ్యాంక్‌లో ఉన్న నిజాం నిధులపై తమకు హక్కుందని పాకిస్తాన్‌ పదేపదే చేస్తున్న వాదన వీగిపోయినట్లు అయింది. దేశ విభజన సమయంలో అప్పటి హైదరాబాద్‌ నిజాం తనపై సైన్యం దండెత్తవచ్చనే భయంతో బ్రిటన్‌లో పాక్‌ హైకమిషనర్‌కు ఈ నిధులు పంపారు.

ఈ నిధులు 1948 సెప్టెంబర్‌ నుంచి బ్రిటన్‌కు పాకిస్తాన్‌ హైకమిషనర్‌ ఖాతాలో ఉన్నాయి. వీటిపై తమకే హక్కులు ఉంటాయని పాకిస్తాన్‌ వాదిస్తుండగా, నిజాం వారసులు భారత్‌ ప్రభుత్వంతో కలిసి తమ వాదనలు వినిపించారు. ఈ నిధులు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాక్‌ వినిపించిన వాదనలను బ్రిటన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు ఈ నిధులు చెందుతాయని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నిధి లబ్ధిదారునిగా ఏడవ నిజాంను గుర్తిస్తూ ఆయన ఇద్దరు మునిమనవలకు ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని తెలిపింది.

Next Story
Share it