కోటంరెడ్డికి బెయిల్

అలా అరెస్ట్. ఇలా బెయిల్. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే బెయిల్ తెచ్చుకున్నారు. ఓ లేఔట్ విషయంలో ఎంపీడీవోతో ఘర్షణకు దిగిన ఆయనపై పోలీసు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు మాట వినలేదని ఎంపీడీవో ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయించటంతో ఆమె ఇంటి ముందు చెత్త వేయించారు. ఈ వ్యవహారంపై సీరియస్ సీఎం జగన్ కూడా చట్ట ప్రకారం ముందుకెళ్ళాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
దీంతో ఆదివారం ఉదయమే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోంటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర చేశారని ఆరోపించారు. ఆయనే ఎంపీడీవోతో తనపై కేసు పెట్టించారని ఆరోపించారు. తనపై కేసు పెట్టించిన పెద్ద తలకాయ ఎవరో జగన్ తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.