‘ఖైదీ’ మూవీ రివ్యూ
ఒక్క పాట లేదు. సినిమాలో హీరోయినే లేదు. సినిమాలో ఉన్నదంతా ఓ లారీ. ఓ అనాథ ఆశ్రమం. పోలీసులు. విలన్ గ్యాంగ్. హీరో కార్తి. టన్నులకు టన్నుల మాదక ద్రవ్యాలు. సినిమా ఇలా కూడా తీయోచ్చా అని చూపించారు దర్శకుడు లోకేష్ కనకరాజు. ఓ చిన్న లైన్ తో సినిమాను అలా అలవోకగా..ఎక్కడా బోర్ కట్టించకుండా కథను నడిపించిన విధానం ఖచ్చితంగా మెచ్చుకోకతప్పదు. చాలా సినిమాల్లో ఉన్నట్లే ఇందులోనూ ఓ మాదక ద్రవ్యాల గ్యాంగ్. గ్యాంగ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ 800 కోట్లు. పోలీసుల నుంచి వీటిని విడిపించుకునేందుకు విలన్ గ్యాంగ్ ఎత్తుగడలు. అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు అందరినీ ఓ చోటకు చేర్చి పార్టీ ఇచ్చి ఇఛ్చి అందులో ఓ ఐదారు గంటల పాటు కదలకుండా ఉండే మత్తు పదార్ధాలను కలిపేస్తారు. ఈ పని చేసేది పోలీసు ఉన్నతాధికారులే. పార్టీలో మద్యం సేవించి పడిపోయిన అధికారులను ఆస్పత్రికి తరలించాలి అంటే అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి.
ఎవరికీ డ్రైవింగ్ రాదు. కానీ పోలీసు జీపులో ఉన్న అప్పుడై విడుదలైన ఖైదీ డిల్లీ(కార్తీ) కన్పిస్తాడు పోలీసు ఉన్నతాధికారికి. ఆయన సాయం తీసుకుంటారు. ఫస్ట్ అందుకు ససేమిరా అన్న డిల్లీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుని ముందుకు సాగుతాడు. అక్కడ నుంచి కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తీసుకుంటుంది. డిల్లీ పాత్రలో హీరో కార్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అనాథ ఆశ్రమంలో ఉన్న తన కూతురిని కలుసుకునేందుకు డిల్లీ పడే తపన..అందుకు పోలీసు అధికారి నుంచి వచ్చే హామీలు...మధ్య మధ్యలో గ్యాంగ్ ల ను ఎదుర్కొనే ఫైట్లు వెరసి ఖైదీ సినిమా చాలా వరకూ గ్రిప్పింగ్ గా నే నడిపించాడు దర్శకుడు. ఎస్పీ ఆఫీస్ లోని అండర్ గ్రౌండ్ లు వందల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను దాచిపెట్టడం..వాటిని తీసుకెళ్లేందుకు గ్యాంగ్ చేసే ప్రయత్నాలు..ఎస్పీ ఆఫీసులో చిక్కుకు పోయిన ఇంజనీరింగ్ కుర్రాళ్ళు చేసే హంగామా ఆకట్టుకుంటాయి. కార్తి ఒంటిచేత్తో సినిమాను నడిపించాడనే చెప్పాలి. సింపుల్ స్టోరీని ఇంత గ్రిప్పింగ్ గా తీయటం సాధ్యం అవుతుందా అన్న తరహాలో సినిమాను తెరకెక్కించారు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ డైలాగ్ లు ప్రేక్షకులకు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చేస్తాయి. మొత్తానికి కార్తీ ‘ఖైదీ’ ఓ డిఫరెంట్ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే క్లైమాక్స్ లో ప్రేక్షకులకు ‘దీపావళి’ ముందు వచ్చిందా అన్నట్లు ఉంటుంది ఆ సీన్.
రేటింగ్. 3/5