Telugu Gateway
Andhra Pradesh

ఆశ్రమాలా...బ్లాక్ మనీ డంపింగ్ కేంద్రాలా?

ఆశ్రమాలా...బ్లాక్ మనీ డంపింగ్  కేంద్రాలా?
X

అవి ఆశ్రమాలా?. లేక బ్లాక్ మనీ కేంద్రాలా?. కొంత మంది స్వామిజీలపై మార్కెట్లో చాలా రూమర్లు ఉన్నాయి. స్వాములుగా చెలామణి అవుతున్న వారు చాలా మంది రాజకీయాల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారి అక్రమ సంపాదనకు ‘పార్కింగ్’ కేంద్రాలుగా ఉపయోగపడుతున్నారని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. కొంత మంది సంబంధాలు కూడా బహిరంగంగానే కన్పిస్తుంటాయి. అయితే ఎవరైనా దొరకనంత వరకే. అప్పటివరకూ అంతా రాజులే. తాజాగా కల్కీ ఆశ్రమంలో బయటపడుతున్న సంపద తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా పెద్ద కలకలమే రేపుతోంది. ఎందుకంటే అక్కడ కట్టలకు కట్టలు డబ్బుతోపాటు..బంగారం..విదేశీ కరెన్సీ, భారీ సంఖ్యలో డాక్యుమెంట్ల లభిస్తున్నాయి. ఇవి చూసి సాక్ష్యాత్తూ ఐటి శాఖ అధికారులే కళ్ళు తేలేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

చిత్తూరు జిల్లాలోని ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ చుట్టు ఉచ్చు బిగిస్తోంది. కల్కి ఆశ్రమాల్లో జరిపిన ఐటీ సోదాల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. వేల ఎకరాలు, కోట్ల రూపాయలు.. పలు వ్యాపారాలు నడుపుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. అలాగే కల్కి ఆశ్రమం పేరును పదే పదే మార్చినట్లు ఐటీ గుర్తించింది. పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని తనిఖీల్లో రూ. 33 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉంది. దీంతో ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఐటీ సోదాల్లో కల్కి కుమారుడు కృష్ణాజీ నుంచి రూ. 30 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిజానికి కల్కి భగవాన్ ఆశ్రమంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయటకు మాత్రం ఆధ్యాత్మిక శిక్షణాతరగతులు, గ్రామాల అభివృద్ధి అని చెబుతారు. ఐదెకరాల నుంచి ప్రారంభమైన కల్కి ఆశ్రమం వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే ఈ మధ్య ఈ పేరును ‘ఏకం’ అని మార్చారు. రకరకాల కంపెనీలు, ట్రస్ట్‌ల పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయకుమార్ నాయుడు అలియాస్.. కల్కి భగవాన్.. తొలినాళ్లలో బీమా సంస్థలో క్లర్క్‌గా చేశారు.

ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి రామకుప్పంవద్ద జీవాశ్రమం పేరుతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అది దివాళ తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయకుమార్ వరదయ్యపాలెంలో ప్రత్యక్షమయ్యారు. ఐదెకరాల్లో కల్కి ఆశ్రమాన్ని ప్రారంభించారు. తాజాగా ఐటి శాఖ దాడులకు సంబంధించిన వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువే సుమారు 93 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. అంతే కాదు..ఈ గ్రూప్ సంస్థల లావాదేవీలు 500 కోట్ల రూపాయల పైనే ఉంటాయని..ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఐటి శాఖ వెల్లడించింది. ఆశ్రమంలో ఏకంగా 44 కోట్ల రూపాయల నగదు కట్టలకు కట్టలు..గుట్టలు గుట్టలుగా దొరికాయి. అంతే కాదు..25 లక్షల అమెరికా డాలర్లు. 88 కిలోల బంగారం. 5 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. భారత్ లోనే కాకుండా పలు విదేశాల్లో కూడా పలు కంపెనీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

Next Story
Share it