Telugu Gateway
Politics

ఇదేనా తెలంగాణ కోరుకున్న స్వయం పాలన?

ఇదేనా తెలంగాణ కోరుకున్న స్వయం పాలన?
X

తెలంగాణ సర్కారుపై బిజెపి మండిపడింది. ఆర్టీసి సమ్మె విషయంలో కెసీఆర్ సర్కారు తీరును బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘స్వయం పాలన..స్వరాష్ట్రం అని నీతులు చెప్పిన కెసీఆర్ కనీసం పండగ సందర్భంగా కార్మికులకు సెప్టెంబర్ జీతాలు కూడా ఇవ్వకుండా అమానవీయంగా వ్యవహరించారు. వరంగల్ లో మూడున్నర ఎకరాల ఆర్టీసి ఆస్తులను ఓ వ్యాపార సంస్థకు కట్టబెట్టారు. విలువైన భూములను అప్పగిస్తున్నారు. హైదరాబాద్ లోని 1500 కోట్ల ఆస్తులపై కూడా కన్నేశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణ కోసం సర్కారు మొగ్గుచూపుతోంది. సెల్మ్ డిస్మస్ సంగతి దేవుడెరుగు..ప్రజలందరూ కలసి ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయటానికి రెడీగా ఉన్నారు. ’ అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కెసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కోసం బిజెపి నాంది పలుకుతోంది. రాజకీయాలు..పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాలకు బిజెపి ఎప్పుడూ మద్దతులగా నిలుస్తుందని తెలిపారు.

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఓ కుటుంబ ఆధిపత్యం మాత్రమే సాగుతోందని అని విమర్శించారు. అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా లోబర్చుకోవడం తెలంగాణలో అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. గత ఆరు సంవత్సరాల్లో ఆరు సార్లు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి‌, కష్టపడి పనిచేస్తోన్న కార్మికులను డిస్మిస్‌ చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ కార్మికశాఖా మంత్రిగా పనిచేసినా చట్టాలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పాలకులు నియంతలుగా మారి ప్రశ్నించే వాళ్ల గొంతును నొక్కేస్తున్నారని, అమరుల త్యాగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె కేవలం 50 వేల మంది కార్మికుల సమస్య కాదని యావత్‌ తెలంగాణ ప్రజల సమస్యని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మెడలు వంచే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమం లాగా తుదిదశ ఉద్యమం​ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it