Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 25 మంది మంత్రులు..20 మంది సలహాదారులు

ఏపీలో 25 మంది మంత్రులు..20 మంది సలహాదారులు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ‘రికార్డు’ సృష్టించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆయన సలహాదారుల నియామకాలు చేపట్టారు. ఏపీలో కొత్తగా ఓకేసారి 1,26,728 మందికి ఉద్యోగాలు ఇవ్వటం ఓ రికార్డు అయితే..సలహాదారుల నియామకం కూడా ఓ రికార్డుగానే ఉంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంది ప్రభుత్వ సలహాదారులు ఉండి ఉండరు. అక్కడ వరకూ ఎందుకు..కేంద్రంలో కూడా ఇంత మంది సలహాదారులు ఉంటారా? అంటే సందేహమే అంటున్నాయి అధికార వర్గాలు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలుపుకుంటే మంత్రివర్గం సంఖ్య 26. ఆయన కాకుండా మిగిలిన మంత్రుల సంఖ్య 25. కానీ గత ఐదు నెలల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన సలహాదారుల సంఖ్య ఇప్పటికే 20కి మంది చేరింది. ఇక్కడితో ఇది ఆగిపోతుందా? లేదా అంటే కూడా ఎవరికీ తెలియదు. ఈ సలహాదారుల్లో చాలా మంది మళ్ళీ కేబినెట్ ర్యాంక్ సలహాదారులు కూడా ఉన్నారు. 23 జిల్లాలతో కూడిన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత భారీ స్థాయిలో సలహాదారులు ఎప్పుడూ లేరు. చంద్రబాబు హయాంలో కూడా సలహాదారులు ఉన్నా కూడా అది పరిమిత సంఖ్యలోనే ఉంది. కాకపోతే గత ప్రభుత్వం భారీ ఎత్తున కన్సల్టెన్సీల నుంచి సేవలు పొందింది.

గత ప్రభుత్వంలో ఐటి శాఖకు ఇద్దరు సలహాదారులు ఉండగా..జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా ముగ్గురిని రంగంలోకి దింపింది. జగన్ సర్కారు విషయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. గతంలో ఎన్నడూలేని రీతిలో సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే రిటైర్డు ఐఏఎస్ లు కీలక శాఖల బాధ్యతలు చూస్తున్నారు. సీఎంవోలో సహజంగా సబ్జెక్ట్ ల బాధ్యత సర్వీసులో ఉన్న అధికారులకు మాత్రమే అప్పగిస్తారు. కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు రిటైర్డు అధికారులకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించిన తీరుపై ఐఏఎస్ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొని ఉంది.

Next Story
Share it