రైతు భరోసా ప్రారంభోత్సవానికి రండి..మోడీకి జగన్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా మోడీని జగన్ ఆహ్వానించారు. ఈ పథకం అమలుకు జగన్ సర్కారు కేంద్రంలోని మోడీ సర్కార్ అందజేస్తున్న సాయాన్ని కూడా వాడుకుంటున్న విషయం తెలిసిందే. జగన్, ప్రధాని మోడీ భేటీలో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం, రివర్స్ టెండరింగ్ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
వీటితోపాటు ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని జగన్ కోరారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించారు.