జగన్ కిల్లర్ రాజకీయాలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కిల్లర్ రాజకీయాలు టీడీపీ దగ్గర పనిచేయవన్నారు. జగన్ డౌన్ డౌన్ అంటే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తనను నడి బజార్లో కాల్చి చంపేయాలంటూ వ్యాఖ్యానించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు పోలీసులు ఏమి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తీవ్రవాదులు దాడి చేస్తేనే తనకేమీ కాలేదు. పులివెందుల రాజకీయాలే చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
నాయకులు వెళ్లినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుందన్నారు. టీడీపీకి శ్రీకాకుళం జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. అంతకుముందు చంద్రబాబు పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు త్యాగాలు గొప్పవని కొనియాడారు. పోలీసు వ్యవస్థ అంటే టీడీపీకి ఎనలేని గౌరవమని అన్నారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.