Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జీఎంఆర్ తో జగన్ సర్కారు లాలూచీ?!

0

అందరినీ ఒకేలా చూస్తాం. కులం లేదు..మతం లేదు..పార్టీ లేదు. ఇవీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పిన మాటలు. కానీ ఒక్కో కంపెనీ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక్కోలా వ్యవహరిస్తోంది. నవయుగా గ్రూప్ నకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు నెల్లూరు జిల్లాలో ప్రత్యేక ఆర్ధిక మండలి కోసం కాంగ్రెస్ సర్కారు వేల భూములు కేటాయించింది. అందులో ఇంత వరకూ పెద్దగా ఎలాంటి పురోగతి లేదు.  ఈ భూములు రద్దు చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇందులో తప్పుపట్టాల్సి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ కంపెనీలు లేవు..పెట్టుబడులు లేవు. కానీ ఇదే తరహాలో కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి కోసం జీఎంఆర్ కు చెందిన కంపెనీలకే కాకినాడలో  వేల ఎకరాల భూములతో పాటు రాయితీలు, పలు మినహాయింపులు  కూడా ఇచ్చారు. కానీ జగన్ సర్కారు మాత్రం దానిపై మాత్రం మాట్లాడటం లేదు. జీఎంఆర్ తో జగన్ సర్కారు లాలూచీ పడింది అనటానికి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి.

- Advertisement -

ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టును జీఎంఆర్ తోనే కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు సాక్ష్యాత్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అవి ఆరోపణలే కాదు నిజాలు కూడా.  తొలుత పిలిచిన టెండర్లలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్  పోర్ట్స్ ఆథారిటీ ఆప్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన ఈ ప్రాజెక్టును అప్పటి చంద్రబాబు సర్కారు మోకాలడ్డింది. ఎంఆర్ వో సౌకర్యంతోపాటు మరిన్ని వసతుల కల్పన కోసం అంటూ ఆ టెండర్లను రద్దు చేసింది. దీనిపై జగన్మోహన్ రెడ్డే పలుమార్లు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు చేశారు. కేవలం అస్మదీయ కంపెనీ జీఎంఆర్ కు అనుకూలంగా నిబంధనలు పెట్టి మళ్ళీ టెండర్లు పిలిచారు. రీ టెండర్లలో  సహజంగానే పనులు ఆ సంస్థకు దక్కాయి. అయితే అసలు ఈ టెండర్ మోడలే తప్పు అని రెవెన్యూలో వాటా వేరు కానీ..టిక్కెట్ల ధరలో వాటా అనటం వల్ల సర్కారుకు నష్టం అని ఆర్ధిక శాఖ అధికారులు ఫైలులోనే స్పష్టంగా రాశారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సర్కారు కారుచౌకగా 2703 ఎకరాలు అప్పగించనుంది. దీంతోపాటు రాయితీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు  కూడా ఇస్తారు. ఈ టెండర్ గోల్ మాల్ పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అక్రమాలను తాను అసలు సహించని..ప్రజాధనం ఆదా చేయటమే తన లక్ష్యంగా చెప్పుకునే జగన్ మరి భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో జీఎంఆర్ ను అనుకూలంగా ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు?. తాను చేసిన విమర్శలపైనే తాను ఎందుకు  వెనక్కి పోతున్నట్లు?. ఏపీకి ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అవసరం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రతి దానికి రివర్స్ టెండరింగ్ అనే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ఎందుకు జీఎంఆర్ కు జీహూజూర్ అంటున్నట్లు?. ఇది లాలూచీ కాదా?.

 

Leave A Reply

Your email address will not be published.