Telugu Gateway
Telangana

మళ్లీ వస్తామని వెళ్ళారు..రాలేదు

మళ్లీ వస్తామని వెళ్ళారు..రాలేదు
X

ఆర్టీసి సమ్మెకు సంబంధించిన పీఠముడిపై ఎవరి వాదన వారు విన్పిస్తున్నారు. సర్కారు కోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ కేవలం 21 డిమాండ్లపై చర్చలు అని చెబుతోందని జెఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆర్టీసి యాజమాన్యం వాదన మరోలా ఉంది. తమ సభ్యులతో చర్చించుకుని వస్తామని వెళ్లిన జెఏసీ నేతలు రాలేదని..మళ్ళీ వచ్చినా వారితో చర్చలకు తాము సిద్ధమని ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. విలీనం అంశంపై చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలిపారు.

గంటన్నర పాటు చర్చలు జరిగితే జెఏసీ నేతలు అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారని..తాము 21 డిమాండ్లపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశానికి ఎలాంటి అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే యూనియన్ నేతల ఫోన్లు బయట తీసుకున్నారని ఎండీ తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. తాజా పరిణామాలతో హైకోర్టులోనే ఆర్టీసి సమ్మెకు శుభం కార్డు పడాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. సోమవారం నాడు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది.

Next Story
Share it