మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో 4.25 కోట్ల నగదు

కర్ణాటకలో ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఏకంగా 4.25 కోట్ల రూపాయల నగదు పట్టుబడటం విశేషం. ఇది ఇప్పుడు కర్ణాటకలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. బెంగుళూరు, తుముకూరుతోపాటు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పరమేశ్వరతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో మొత్తం 4.25 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు పరమేశ్వర, ఎంపీ ఆర్‌ఎల్ జలప్ప ఇళ్లల్లో... తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారుల బృందం తెలిపింది.
ఈ తనిఖీల్లో ఏకంగా 300 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు. పరమేశ్వర కుటుంబం దొడ్డబల్లాపురలో సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూట్ కళాశాల నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ జలప్ప కోలార్‌లో ఆర్‌ఎల్ జలప్ప ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నడిపిస్తున్నారు. అర్హత లేని విద్యార్థులకు మెడికల్ సీటును 50-60 లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఐటీ అధికారులు దాడులకు దిగగా పెద్ద మొత్తంలో సొమ్ము దొరకటంతోపాటు, అక్కడ లభ్యమైన పత్రాలతో ఆరోపణలు వాస్తవమేనని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.