Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ పొలిట్ బ్యూరోనా..‘ఆ రెండు కంపెనీల’ బోర్డు మీటింగా?

టీడీపీ పొలిట్ బ్యూరోనా..‘ఆ రెండు కంపెనీల’ బోర్డు మీటింగా?
X

తెలుగుదేశం పొలిట్ బ్యూరో. పేరుకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి. గురువారం నాడు జరిగిన టీటీపీ పొలిట్ బ్యూరో సమావేశం తీరుపై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఒకే జిల్లా నుంచి ఏకంగా నలుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ అధినేత, విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, గల్లా అరుణకుమారి, ఆమె తనయుడు గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉండొచ్చు..నారా లోకేష్ మంగళగిరి నుంచి పొటీచేసి ఉండొచ్చు. కానీ వీళ్ళంతా ‘చిత్తూరు’ జిల్లాకు చెందిన వారే. అంతే కాదు. ఒకప్పుడు నారా లోకేష్ నాది తెలంగాణానే..నేను అక్కడే పుట్టి పెరిగాను అన్నారనుకోండి. అది పాత కథ. తాజా పొలిట్ బ్యూరో సమావేశంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. ఇది పొలిట్ బ్యూరో సమావేశమా లేక హెరిటేజ్, అమరరాజా కంపెనీల బోర్డు సమావేశమా? అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత కూడా చంద్రబాబునాయుడిలో ఇంకా వాస్తవిక దృక్ఫదం లోపించింది అనటానికి పొలిట్ బ్యూరో వ్యవహారం స్పష్టంగా కన్పిస్తోందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత గల పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాలకు అసలు అందులో ప్రాతినిధ్యమే లేదు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత కాలం క్రితం గల్లా అరుణకుమారి తనకు రాజకీయాలపై అసలు ఆసక్తేలేదని..తాము తప్పుకుంటానని ప్రకటించారు. గల్లా జయదేవ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నా ఆయన పార్లమెంట్ ఉన్నప్పుడు ఏదో సమావేశాల్లో మాట్లాడటం తప్ప..రాజకీయంగా అంత చురుగ్గా వ్యవహరించరని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో పరుగులు పెట్టించే వారితో పొలిట్ బ్యూరో ను శక్తివంతం చేయాలి కానీ..ఇలా ఫ్యామిలీ ప్యాక్ లు ఏమిటనే విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో టీడీపీ ఇప్పుడు రాజకీయంగా పెద్ద సవాల్ ను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కూడా చంద్రబాబునాయుడు సీరియస్ గా కాకుండా పాత తరహాలో ముందుకెళితే టీడీపీని దేవుడే కాపాడాలని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it