Telugu Gateway
Politics

పీవోకె లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి

పీవోకె లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
X

భారత్ మరోసారి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకె)లో. భారత సైన్యం జరిపిన ఈ దాడుల్లో ఏకంగా దాదాపు పది మంది పాక్ సైనికులు..అదే స్థాయిలో ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని భారత సైనికాధిపతి బిపిన్ రావత్ వెల్లడించారు. నీలం లోయలో లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా..ఒకటి మాత్రం పాక్షిగానే దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. పాక్ ప్రోత్సాహంతో కొంత మంది ఉగ్రవాదులు తంగ్దర్ సెక్టార్ లో కాల్పుల ద్వారా భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించటంతో..భారత్ సైన్యం పక్కా సమాచారంతో ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు.. ఇదిలా ఉంటే పాకిస్తాన్ విషయంలో ఎప్పటిలాగానే రియాక్ట్ అయింది.

పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ భారత డిప్యూటీ హై కమిషనర్‌ గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది. పాక్‌ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 4 ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి.. తమ దేశ పౌరులను పొట్టనబెట్టుకుందని పాక్ ఆరోపించింది. భారత కాల్పుల్లో ఓ పాక్‌ సైనికుడితో పాటు ముగ్గురు పౌరులు చనిపోయారని పాక్‌ ఆర్మీ అధికారులు చెప్పారు. అలాగే ఇద్దరు సైనికులు, ఐదుగురు పౌరులు చనిపోయినట్టు తెలిపారు. ఎక్కడ కూడా ఉగ్ర స్థావరాలు గానీ, ఉగ్రవాదులు గానీ మరణించినట్టు పాక్‌ ప్రస్తావించకపోవట విశేషం. తాంగ్ధర్‌ సెక్టార్‌లో శనివారం సాయంత్రం పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story
Share it