క్లారిటీ ఇఛ్చిన అమిత్ షా

బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని తేల్చిచెప్పారు. ఓ వైపు మిత్రపక్షం శివసేన తాము సీఎం పీఠంపై కన్నేశామని పదే పదే చెబుతోంది. అయినా సరే అమిత్ షా వీటిని కొట్టిపారేస్తూ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తమ మధ్య పెద్దగా విభేదాలు ఏమీ లేవని..ఏదైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా అవి పొత్తుకు విఘాతం కల్పించేవి కావన్నారు. ఓ మీడియా ఇంటర్వూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అదే సమయంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్ కు సంబంధించిన అంశంపై కూడా అమిత్ షా స్పష్టతనిచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి నాయకత్వ బాధ్యతలను సీఎం నితీశ్ కుమారే చేపడతారని అమిత్ షా తెలిపారు. బీహార్ ఎన్నికలను నితీశ్ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని, 2020 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేస్తాయని, తమ కూటమిలో విబేధాలు ఉన్నాయన్న వార్తలను కొట్టిపారేశారు. బీహార్‌లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఇరుపార్టీల నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. నితీశ్ సర్కార్‌పై బీజేపీ నేతలు బహాటంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి కొనసాగుతుందా? అన్నా అనుమానాలు వ్యక్తం అవుతున్న దశలో అమిత్ షా వ్యాఖ్యలు పరిస్థితిలో స్పష్టతనిచ్చాయనే చెప్పొచ్చు.