Telugu Gateway
Politics

హుజూర్ నగర్ లో సీపీఎం నామినేషన్ తిరస్కృతి

హుజూర్ నగర్ లో సీపీఎం నామినేషన్ తిరస్కృతి
X

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు. ఓ వైపు భారీ ఎత్తున సర్పంచ్ లు నామినేషన్లు వేసి సర్కారుకు వ్యతిరేకంగా తమ సత్తా చాటాలని చూడగా..సీపీఎం ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించింది. చివరకు సీపీఎం అభ్యర్ధి నామినేషన్ కూడా తిరస్కరణకు గురికావటంతో షాక్ కు గురవటం ఆ పార్టీ వంతు అయింది. సత్తా చాటడం సంగతి అలా ఉంచి సరిగ్గా నామినేషన్ కూడా వేయలేకపోయారనే విమర్శలు మూటకట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు. తిరస్కరణకు గురైన వాటిలో సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తోపాటు తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్‌, స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసమ్మ, వికలాంగుడు గిద్ద రాజేష్‌, ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన లింగిడి వెంకటేశ్వర్లులకు చెందిన నామినేషన్‌ పత్రాలు ఉన్నాయి.

ఉప ఎన్నికకు సోమవారంతోనే నామినేషన్ల గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నాడు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించారు. వీటిలో సరైన దృవ పత్రాలు పొందుపరచని కారణంగా కొన్నింటిని తిరస్కరించారు. నామినేషన్ల తిరస్కరణపై కొంత మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోటీకి తమను అనుమతించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికకు మొత్తం 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చివరకు బరిలో ఎంత మంది నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it