తెలంగాణ గవర్నర్ తో చిరంజీవి భేటీ

గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో భేటీ కావటం ఆసక్తికర పరిణామంగా మారింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా అటు కాంగ్రెస్ తోపాటు ఇటు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన తరపున కూడా ప్రచారం చేయకుండా మౌనంగా ఉండిపోయారు. తాజా పరిణామం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చిరంజీవి శనివారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేక ఏమైనా రాజకీయ కోణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరూ ఏమి చర్చించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహరెడ్డి తాజాగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.చిరంజీవి తన భేటీలో గవర్నర్ ను సైరా సినిమాను వీక్షించాలని కోరగా..అందుకు ఆమె కూడా సమ్మతించారని సమాచారం.