Telugu Gateway
Telangana

మనుషులు చనిపోతున్నా పట్టించుకోరా..హైకోర్టు సీరియస్

మనుషులు చనిపోతున్నా పట్టించుకోరా..హైకోర్టు సీరియస్
X

డెంగ్యూ జ్వరాలతో రాష్ట్రంలో ఎంతో మంది చనిపోతున్నా పట్టించుకోరా అంటూ తెలంగాణ హైకోర్టు మండిపడింది. వైద్య ఆరోగ్య శాఖపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అంతే కాదు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో డెంగీ నియంత్రణకు ఇఫ్పటివరకూ తీసుకున్న చర్యలు ఏమిటి?. ఈ విషయంలో చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు గురువారం ఉదయం పదిన్నరకు కోర్టు ముందుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం డెంగీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆ పరిస్థితులు ఎక్కడా కన్పించటంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విషజ్వరాలతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఏ మాత్రం సరిగాలేదని పేర్కొంది. డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, హోర్డింగ్ లు ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ మరణాలను నియంత్రించటంలో ప్రభుత్వం విపలం అయిందని మండిపడింది. డాక్టర్ కరుణ సర్కారు తీరుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సర్కారు తీరును తప్పుపట్టింది. అడ్వకేట్ జనరల్ సమర్పించిన నివేదిక పరిశీలించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. సర్కారు చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story
Share it