Telugu Gateway
Politics

మహారాష్ట్ర..హర్యానాల్లో బిజెపిదే హవా

మహారాష్ట్ర..హర్యానాల్లో బిజెపిదే హవా
X

అత్యంత కీలకమైన మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఈ నెల 24న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పేశాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి అసలు తాము పోటీలో ఉన్నామనే స్థాయిలో ఎక్కడా గట్టిగా తన సత్తా చాటలేకపోయింది. మరో వైపు బిజెపి తన సత్తా చాటుకుంటూ వెళుతోంది. మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో బిజెపి హవానే కన్పించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నా..హర్యానాలో మాత్రం దారుణ ఓటమి చవిచూడనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సోమవారం నాడు చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.

మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 స్థానాలకు సోమవారం నాడు పోలింగ్‌ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెండోసారి విజయదుందుభి మోగించనున్నదని ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించింది. గతంలో కంటే కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్‌ కంటే ఎన్సీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని పేర్కొంది. బీజేపీకి గరిష్టంగా 124 స్థానాలు, శివసేన 70, కాంగ్రెస్‌ 40 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.

టెమ్స్‌ నౌ సర్వే ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ 230, కాంగ్రెస్‌ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ ప్రకారం బీజేపీ 142, కాంగ్రెస్‌ 24 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 సర్వేప్రకారం.. బీజేపీ 243, కాంగ్రెస్‌ 41, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకోనుంది. ఏబీపీ న్యూ.సిఓటర్‌ ప్రకారం బీజేపీ 204, కాంగ్రెస్‌ 69, ఇతరులు 15 సీట్లను కైవసం చేసుకోనున్నారు. న్యూస్‌24 ప్రకారం.. బీజేపీ 230, కాంగ్రెస్‌ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. అసలు ఫలితాలు ఈ నెల 24న వెల్లడికానున్నాయి.

Next Story
Share it