Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబే అప్పుపుట్టకుండా చేశారు

చంద్రబాబే అప్పుపుట్టకుండా చేశారు
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి అప్పులు పుట్టకుండా చేసింది వీళ్ళిద్దరే అని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు, యనమల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. పవర్‌ ఫైనాన్స్‌ అప్పుపై ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని తెలిపారు. విద్యుత్‌ను ఎక్కువ రేటుకు తీసుకోవడం వల్ల రూ. 2700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు తమపై అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

‘హడావుడిగా పీపీఏలు కుదుర్చుకున్నారు. ధరలు తగ్గుతున్నాయని తెలిసినా ఎక్కువ రేట్లకు కొన్నారు. రూ. లక్షా 23వేల కోట్లుగా ఉన్న అప్పును 2.58 లక్షల కోట్లకు పెంచారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 9 నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అయితే బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ. 3358 కోట్లు చెల్లించారు. అదే నెలలో రూ. 5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. సివిల్‌ సప్లైయ్స్‌ కార్పొరేషన్‌ను నిండా అప్పుల్లో ముంచారు. డబ్బులన్నీ పసుపు- కుంకుమకు వాడేశారు. నచ్చిన కాంట్రాక్టర్లకు రూ. 1060 కోట్లు చెల్లించారు. ఎన్నికలకు ముందు రూ. 38 వేల కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్‌ తీసుకున్నారు’ అని గత ప్రభుత్వ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it