Telugu Gateway
Cinema

‘చాణక్య’ మూవీ రివ్యూ

‘చాణక్య’ మూవీ రివ్యూ
X

గోపీచంద్ కు కాలం కలసి రావటం లేదు. చేసిన సినిమాలు అన్ని యావరేజ్ టాక్ తోనే..లేక బిలో యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత కొంత కాలంగా గోపీచంద్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క హిట్ లేదనే చెప్పొచ్చు. తాజాగా ‘చాణక్య’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ వైపు బాక్సాఫీస్ వద్ద సైరా వంటి భారీ బడ్జెట్ సినిమా ఉంటే ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాను శనివారం నాడు విడుదల చేశారు. ఇది చూసిన వారంతా ఈ సినిమాలో అంత దమ్ముందా? అంటూ ఆశ్చర్య పోయారు.. సైరాతో ఢీ కొట్టే విధంగా ప్రేక్షకుల ముందుకు రావటం ఒకింత ఆశ్చర్యకర పరిణామమే. అయితే చాణక్య సినిమా కూడా గోపీచంద్ కు కలసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో చూసిన కథతోనే దర్శకుడు తిరు సినిమా చుట్టేశాడు. గోపీచంద్ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తాడు. ఒకటి బ్యాంకులో. మరొకటి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో. రాలో అండర్ కవర్ గా పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు.

బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో హీరోయిన్ తో పరిచయం అవుతుంది. పరిచయం అనేకంటే గొడవ అవుతుంది అనటమే బెటర్. ఆ గొడవ కాస్తా...అలా అలా ప్రేమగా మారుతుంది. రా విధుల్లో భాగంగా విదేశంలో కోవర్టు ఆపరేషన్ చేసి పాక్ లో అత్యంత శక్తివంతమైన ఉగ్రవాదికి చెందిన సన్నిహితుడిని హతమార్చుతారు. దీనికి ప్రతిగా రాలో పనిచేసే అర్జున్ స్నేహితులను పాక్ ఉగ్రవాదులు ఎత్తుకెళతారు. వాళ్లను అర్జున్ ఎలా విడిపిస్తాడు. ఇందుకు అనుసరించిన ఎత్తులు..పైఎత్తులే ‘చాణక్య’ సినిమా. తన స్నేహితులను విడిపించుకోవటానికి కరాచీ వెళ్లిన అర్జున్ విలన్ పాత్రదారి అర్జున్ ఖట్టర్ తో ఢీకొట్టే సన్నివేశాలు...ఖట్టర్ తనయుడిగా నటించిన సోహైల్ యాక్షన్ సన్నివేశాలు ఒకింత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. డబుల్ బాడీ కాన్సెప్ట్ సినిమాలో ప్రేక్షకులకు సస్సెన్స్ లా అన్పిస్తోందని చెప్పాలి. రా అండర్ కవర్ గా, బ్యాంక్ ఉద్యోగిగా గోపీచంద్ యాక్షన్ ఓకే అనుకున్నా కథలో దమ్ములేకపోవటంతో సినిమా తేలిపోతుంది. ఫస్టాఫ్ లో కుక్కపిల్లలతో నడిపించిన అడల్ట్ కామెడీ ప్రేక్షకులను ఒకింత ఇబ్బందికి గురిచేస్తుంది. హీరోయిన్ మెహరీన్ పాత్ర కూడా పరిమితమే అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే చాణక్య అత్యంత సాదాసీదా రొటీన్ సినిమాగానే చెప్పుకోవచ్చు.

రేటింగ్:2/5

Next Story
Share it