Telugu Gateway
Andhra Pradesh

జగన్ నిర్ణయం ఎఫెక్ట్...పోలవరం నిధులు ఆపేసిన కేంద్రం!

జగన్ నిర్ణయం ఎఫెక్ట్...పోలవరం నిధులు ఆపేసిన కేంద్రం!
X

ఏపీ అసలే ఆర్ధిక కష్టాల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన ఎడాపెడా అప్పులు ఒక కారణం అయితే..జగన్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన వరాల హామీలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమే. ఈ సమయంలో కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా కేంద్రం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలపైనే పోలవరం నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఇవి ఎఫ్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వైసీపీకి చెందిన మంత్రి ఒకరు వెల్లడించారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలపైనే రావాల్సి ఉంది. వాస్తవానికి జూన్-జూలై ప్రాంతంలోనే కేంద్రం 3000 కోట్ల రూపాయల విడుదల చేయటానికి రెడీ అయింది. ఈ మేరకు ఫైలు ఆర్ధిక శాఖ ఆమోదానికి కూడా వెళ్ళింది. కానీ జగన్ సర్కారు నిపుణుల కమిటీ వేయటం. ఆ కమిటీ పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని నివేదిక ఇవ్వటం..దాన్ని కేంద్రానికి కూడా పంపటంతో రెడీ అయిన నిధుల విడుదల కూడా ఆపేసినట్లు ఓ మంత్రి వెల్లడించారు.

స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పోలవరంలో అక్రమాలు జరిగాయని చెప్పటం..అందుకు నిపుణుల కమిటీ నివేదికను కూడా జత చేసి పంపటంతో ఈ సంగతి ఏంటో తేలాకే విడుదల చేద్దామని కేంద్రం ప్రతిపాదిత ఫైలును పక్కన పడేసిందని చెబుతున్నారు. ఇది మా కన్నుతో మేమే పొడుచుకున్నట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చేసిన ఖర్చుకు సంబంధించిన ఈ నిధులు కేంద్రం నుంచి తెచ్చుకుని ఉంటే ఎంతో వెసులుబాటు ఉండేదని చెబుతున్నారు. కానీ అలా కాకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడటం అంటే ఇదే అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరంలో అక్రమాలు జరిగితే అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ సాఫీగా సాగాల్సిన పనులను ప్రభుత్వం తనంతట తానే చిక్కుల్లో పడేయటం ఏ మాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ధికంగా ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న తరుణంలో ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి ఇష్టానుసారం నిర్ణయాలతో ఇరుకున పడే పరిస్థితులు కొనితెచ్చుకున్నట్లు అవుతోందని ఆయన వాపోయారు. పోలవరం వివాదం తేలాలి అప్పుడు కాని కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం లేదని చెబుతున్నారు.

Next Story
Share it