Telugu Gateway
Politics

అమరావతి ఎవరెత్తుకుపోయారు బాబూ

అమరావతి ఎవరెత్తుకుపోయారు బాబూ
X

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిని ఎవరు ఎత్తుకుపోయారు బాబూ అంటూ ప్రశ్నించారు. అసలు ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలు తప్ప ఏమి ఉన్నాయని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా? అని ప్రశ్నించారు. బొత్స బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విమర్శలపై మండిపడ్డారు. రాజధానిలో గ్రాఫిక్స్‌ తప్ప బాబు చేసింది శూన్యం. మీ హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేసి, మీ చుట్టాలు, తాబేదార్లు దోచుకున్నది వాస్తవం కాదా. బాబు తన వియ్యంకుడికి రాజధాని పక్కన 500 ఎకరాలు కట్టబెట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం.

అమరావతిలో పునాదులు తీయాలంటే 100 అడుగులు తవ్వాలి. అవినీతి, దోపిడీకి తావులేకుండా మంచి రాజధాని నిర్మిస్తాం. రాష్ట్ర రాజధాని దేశంలో మేటి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 5 కోట్ల ప్రజలు హర్షించే రీతిలో రాజధాని కట్టి తీరుతాం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆయన వ్యాఖ్యలు చూస్తే అనుభవమున్న నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కటి కనిపించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారు. చంద్రబాబు అదనంగా లక్షా 65 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. వ్యక్తిగత అవసరాలకోసం వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారన్నారు.

Next Story
Share it