Telugu Gateway
Telangana

ఆర్టీసి బస్సుపై రాళ్ళ దాడి

ఆర్టీసి బస్సుపై రాళ్ళ దాడి
X

తెలంగాణలో ఆర్టీసి బంద్ ఉద్రిక్తంగా మారుతోంది. ఆర్టీసి యూనియన్లు బంద్ కు పిలుపునివ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు చాలా వరకూ నిలిచిపోయాయి. అక్కడక్కడ బస్సులు నడుస్తున్నాయి. మరో వైపు కోదాడలో తాత్కాలిక డ్రైవర్ ఒకరు మందు కొట్టి విధుల్లోకి వచ్చాడు. ప్రయాణికులే గుర్తించి అతన్ని పోలీసులకు పట్టించారు. హైదరాబాద్ లో బస్సుల రద్దు సమస్యను కొంతైనా తగ్గించేందుకు మెట్రో సర్వీసులను పెంచారు. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ‍్యక్తులు రాళ్లదాడి చేశారు. వికారాబాద్ బస్ డిపోకు చెందిన బస్సు పరిగి నుండి వికారాబాద్‌కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో బస్సు ముందు వైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది.

ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు వెంబడి పోలీసుల ఎస్కార్టు వాహనం ఉన్నప్పటికీ దుండగులు మెరుపు వేగంతో దాడి చేసి పారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోలలో ప్రైవేట్‌ డ్రైవర్లతో 150 బస్సులను పోలీస్‌ బందోబస్తు మధ్య నడిపిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 57వేల మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

Next Story
Share it