Telugu Gateway
Telangana

హరీష్ రావు మౌనం మంచిది కాదు

హరీష్ రావు మౌనం మంచిది కాదు
X

ఆర్టీసీ జెఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ సమాజం మూగపోయింది. కానీ ఆర్టీసీ గొంతు మూగపోలేదు. మంత్రి హరీశ్‌రావు మౌనం మంచిది కాదు. పదవులు శాశ్వతం కాదు. కార్మికులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. అవసరం అయితే మళ్లీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కార్మికుల ఆత్మహత్యలు మమ్మల్ని ఇంకా కృశింప చేస్తున్నాయి. పోరాటం చేయాలి కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవచ్చని అన్నారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇఛ్చారు. తన ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో సమ్మెలు ఉండవు ...మంచిగా బతకొచ్చని కేసీఆర్‌ అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్టీల ఒత్తిడికి నాయకులు తలొగ్గారు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడికి ఆర్టీసీ నాయకులు తలొగ్గలేదు. గతంలో తెలంగాణ కోసం ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా సభలు పెట్టింది నేనే. అప్పుడు రాజకీయ నాయకుల ఉచ్చులో పడ్డావని అప్పటి ప్రభుత‍్వం అంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేమాట అంటోంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. కొత్త బస్సులు కొనకపోతే కొండగట్టులాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పక్క రాష్ట్రాల్లో ఎన్ని బస్సులు ఉన్నాయ్‌..మన రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. 2015లో కరీంనగర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ఖమ్మంతో తప్ప ఎక్కడా అరెస్ట్‌ చేయలేదు. కానీ ఈ సమ్మెలో నన్ను రోజు అరెస్ట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. ఆర్టీసీలో 4వేలమంది కార్మికులకు సకల జనుల సమ్మె నాటి జీతం ఇంకా ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటు విషయం. మా ఆస్తులపై కేసీఆర్‌ కన్నేశారు. ఒకే వ్యక్తికి 44 పెట్రోల్‌ బంక్‌లు ఇవ్వడంపై గవర్నర్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే. పసునూరి దయాకర్‌ పేరుతో కొందరు ఆర్టీసీ ఆస్తులను లీజ్‌కు తీసుకున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Next Story
Share it