Telugu Gateway
Politics

మీడియాను బెదిరించే జీవో జారీ !

మీడియాను బెదిరించే జీవో జారీ !
X

నిరాధార వార్తలు రాస్తే కేసులు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ప్రభుత్వం వరకూ ఎందుకు?. వ్యక్తులు కూడా తప్పుడు వార్తలు రాస్తే ఆయా పత్రికలు..టీవీలపై ఫిర్యాదు చేయవచ్చు. లీగల్ గా ప్రొసీడ్ కావొచ్చు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఇలాగే బెదిరించారు. ‘ప్రూవ్ ఆర్ పెరిష్’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే రాజకీయ నేతలతో పాటు ఎవరిపైనా అయినా కేసులు పెడతామని..ఆరోపించిన వారిదే నిరూపించాల్సిన బాధ్యత అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు చేతనైతే కేసులు పెట్టుకోండి..ఇదిగో చేప పిల్లల స్కామ్..ఇదిగో కాళేశ్వరం స్కామ్ అంటూ పలు అంశాలపై మీడియా సాక్షిగా సవాళ్లు విసిరారు. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ కానీ..తెలంగాణ ప్రభుత్వం కానీ ఆరోపణలు చేసిన వారిపై ఎలాంటి చర్యలకు దిగలేదు. ఇది అంతా పాత కథ. ఇఫ్పుడు ఏపీ సర్కార్ ఏకంగా మీడియాను బెదిరిస్తూ జీవోనే తీసుకొచ్చింది. ఈ జీవో లేకుండా కూడా తప్పుడు వార్తలు..నిరాధార వార్తలు రాసిన వారిపై కేసులు పెట్టుకునే వెసులుబాటు ఉంది.

మరి అలాంటప్పుడు ఏకంగా జీవో తేవాల్సిన అవసరం ఏముంది?. అంటే ఖచ్చితంగా ఇది మీడియాను బెదిరించే ప్రయత్నమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన దాని ఆధారంగా ఏపీ సర్కార్ బుదవారం నాడు జీవో 2430 జారీ చేసింది. దీని ప్రకారం ఆయా శాఖల కార్యదర్శులు నిరాధార వార్తలు, పరువు నష్టం కలిగించే వార్తలు రాసినా, ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకోవటానికి వీలుగా ఓ బ్లాంకెట్ ఆర్డర్ జారీ చేశారు. మీడియా నుంచి ఇలాంటి ఇబ్బంది ఉంటుందని గ్రహించినప్పుడు ఓ లీగల్ సెల్ ఏర్పాటు నిరాధార వార్తలు రాసే, ప్రసారం చేసి ఆయా పత్రికలు..చానళ్లపై కేసులు వేస్తే సరిపోయేదానికి..మీడియా మొత్తాన్ని బెదిరించే దోరణితో ఏకంగా జీవో జారీ చేయటం ఏ మాత్రం సరికాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ జీవో జారీ ద్వారా జాతీయ స్థాయిలో కూడా ఏపీ సర్కారు మరో సారి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Next Story
Share it