ఆంధ్రజ్యోతి భూ కేటాయింపును రద్దు చేసిన జగన్ సర్కారు
ఆ భూమి విలువ 40 కోట్లు!
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విశాఖపట్నంలోని పరదేశిపాలెంలో కేటాయించిన 1.5 ఎకరాల భూ కేటాయింపును సర్కారు రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం నాడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రద్దు చేసిన భూమిని బలహీనవర్గాల ఇళ్ళకు కేటాయించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2017, జూన్ 28న ఆమోదా పబ్లికేషన్స్ కు అప్పటి చంద్రబాబు సర్కారు ఈ భూ కేటాయింపులు చేసింది.
దీని విలువ 40 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఈ భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పేర్పి నాని వెల్లడించారు. నిజానికి ఆ పత్రికకు ఇప్పటికే అవసరమైన స్థలం ఉందని,అయినా కావాలని ఆ పత్రికకు గత ప్రభుత్వం కేవలం క్విడ్ ప్రోకో కింద ఆ భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. అక్కడ ఆ భూమిలో నిర్దిష్ట కార్యకలాపాలు సాగడం లేదని, అందువల్ల ఆ భూమి కేటాయింపును రద్దు చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే దినపత్రికలకు ఇచ్చే ప్రకటనల టారిఫ్ ను పెంచుతూ కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.