Telugu Gateway
Andhra Pradesh

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే
X

చేనేత కార్మికులకు 24 వేలు

మత్సకార కుటుంబాలకు పదివేలు

ఏపీ కేబికేట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలోని చేనేతలకు ఏడాదికి 24 వేల సాయం చేయటానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’గా పేరు పెట్టారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రయోజనం కల్పించనున్నారు. లబ్దిదారుల జాబితాను కూడా ప్రదర్శిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ 21 నుంచి ఈ పథకం అమలుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో వేట నిషేధ సమయంలో మత్సకార కుటుంబాలకు పది వేల రూపాయలు ఇవ్వటానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మెకనైజ్డ్, మోటారైజ్డ్, నాన్ మోటారైజ్డ్ బోట్లు ఉన్న కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. తెప్పలపై సముద్రంలోకి వెళ్ళే వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ వేట నిషేధ సమయం అని..అప్పుడే ఈ నిధులు అందజేస్తారని తెలిపారు. నవంబర్ 21 నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మత్సకారులకు డీజిల్ పై ఇచ్చే సబ్సిడీని 50 శాతానికి పెంచారు. దీని వల్ల ఏటా 96 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా.

13 జిల్లాల్లో రక్షిత తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, విదేశీ ఆర్ధిక సంస్థల, పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ పద్దతుల్లో నిధుల సమీకరణంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా ఏపీలో 4.84 కోట్ల మందికి రక్షిత మంచి నీటి సరఫరా అందించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నా భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం 1000 రూపాయల నుంచి మూడు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు హోంగార్డుల డైలీ అలవెన్స్ ను 600 నుంచి 710 రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఏపీఎస్ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వెయ్యి కోట్ల రూపాయల రుణం తెచ్చుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఇచ్చారు. 3677 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు ఊరటనిచ్చేందుకు 4741 కోట్ల రూపాయల మేర బాండ్ల జారీకి నిర్ణయం.

Next Story
Share it