Telugu Gateway
Andhra Pradesh

బాబు..వంశీల లేఖల మర్మమేమిటి?

బాబు..వంశీల లేఖల మర్మమేమిటి?
X

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వంశీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. దీంతో వంశీ వైసీపీలో చేరటం పక్కా అని ప్రచారం జరిగింది. కానీ వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు కొంత గందరగోళానికి గురిచేశాయనే చెప్పొచ్చు. అసలు వంశీ మనసులో ఏముంది?. భవిష్యత్ లోఎటువైపు మొగ్గుచూపబోతున్నారు వంటి అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వంశీ రాసిన లేఖకు చంద్రబాబు స్పందిస్తూ లేఖ విడుదల చేశారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మన బాధ్యత. అన్యాయం జరిగితే తలదించుకోకుండా పోరాటం చేయాలి. పోరాటంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటాను. వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో మీపై కేసు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇలాంటివి ఆగవు. ప్రభుత్వ కక్షసాధింపులపై ఐక్యంగా పోరాడదాం.. పార్టీ శ్రేణులకు అండగా నిలబడదాం’’ అని వంశీకి రాసిన లేఖలో పేర్కన్నారు.

వైసీపీ నాయకులు, కొంతమంది ప్రభుత్వ అధికారుల వల్ల రాజీనామా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని సూచించారు. మీపై పెట్టిన కేసు దురుద్దేశంతో కూడినదని పేర్కొన్నారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు. దీని ప్రకారం మన ప్రభుత్వం పేద, బలహీన, బలహీన వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయాలను విడిచిపెడితే.. వైసీపీ ప్రతీకార రాజకీయ చర్యలను ఆపబోదన్నారు. రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందిస్తూ మరో లేఖ విడుదల చేశారు. తన లేఖపై స్పందించినందకు చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ హింసను ఎదుర్కొనేందుకు చంద్రబాబు అడుగుజాడల్లో నడిచానని, అన్యాయాన్ని ఎదుర్కొనడంలో అధినేత మద్దతును గుర్తుంచుకుంటానని అన్నారు.

జిల్లా పార్టీ మద్దతు లేకపోయినా రాజ్యాంగబద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడామని గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని, తనపై వచ్చిన ఒత్తిడి తెలుసని, అయినా వెనక్కి తగ్గలేదన్నారు. కనపడే శత్రువుతో యుద్ధం చేయడం తేలిక అని, కానీ కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ వ్యాఖ్యానించారు. కార్యకర్తలను వేధింపులకు గురి చేయకుండా అడ్డుకున్నానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించిన చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చానని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నానని చెప్పారు. గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చిందని.. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను ఎన్నికల్లో గెలుపొందాను చెప్పారు. ఈ లేఖలను పరిశీలిస్తే ఇఫ్పటికిప్పుడే వంశీ భవిష్యత్ రాజకీయ నిర్ణయం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. కొంత కాలం వేచిచూసి తదుపరి అడుగులు వేయవచ్చని అంటున్నారు.

Next Story
Share it