Telugu Gateway
Politics

టీడీపీపై వైసీపీ మంత్రుల మూకుమ్మడి దాడి

టీడీపీపై వైసీపీ మంత్రుల మూకుమ్మడి దాడి
X

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై అధికార వైసీపీ ముకుమ్మడి దాడికి దిగింది. చలో ఆత్మకూరు కు పిలుపునిచ్చిన టీడీపీపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళు పల్నాడులో ఏ ఒక్క రోజు అయినా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారా? అని నేతలు ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతం మొత్తాన్ని యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్ రావుల దోపిడీకి వదిలేశారని..ఇప్పుడు వారిని కాపాడేందుకే చంద్రబాబు తంటాలు పడుతున్నారని ప్రశ్నించారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలు..రాజకీయ అరాచకాలు మర్చిపోయారా? అని మంత్రులు ఎదురుదాడి చేశారు. తమ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. టీడీపీ నేతలు ఇప్పుడు పల్నాడు గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు దొంగ దీక్ష, కొంగ జపాలను ప్రజలు నమ్మరని అన్నారు. పచ్చ నేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాప చుట్టి కృష్ణా నదిలో పడేసారని ఎద్దేవా చేశారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చ నేతలు బెదిరించి కూర్చో బెడుతున్నారని ఎద్దేవా చేశారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గు మాలిన రాజకీయం చంద్రబాబుదని అన్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏపీ రాజకీయాలను డ్రామాలు, సినిమాలుగా మార్చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఛలో ఆత్మకూరు కాదు.. ఛలో నరసరావుపేట, ఛలో యరపతినేని మైనింగ్ అనాలి. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి నీ మాటలు.

ప్రభుత్వం సాగర్‌కి నీళ్లు ఇస్తే.. రైతులు పొలాలు వేసుకుంటుంటే.. పచ్చని పల్నాడులో చిచ్చు రేపుతోంది నువ్వు చంద్రబాబు. ప్రజల చేత తిరస్కరించబడ్డ నేతలు ఇప్పుడు బాబు పక్కన చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. పల్నాడులో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మరో ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తారట. ఆయన ఏమి చేస్తాడనేది జనం పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. వేల మందిని నిర్భందించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగలేదన్నారు.

Next Story
Share it