Telugu Gateway
Politics

కెసీఆర్ అసలు ఆ ప్రకటన ఇప్పుడెందుకు చేశారు?

కెసీఆర్ అసలు  ఆ ప్రకటన ఇప్పుడెందుకు చేశారు?
X

రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణలో అసమ్మతి స్వరాలు విన్పించాయి. సాక్ష్యాత్తూ కేబినెట్ లో ఉండి మరీ సినియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ధిక్కార స్వరం విన్పించారు. మంత్రి పదవి తనకు ఎవరి బిక్షా కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రసమయి బాలకిషన్ తో సహా పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేసి టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్న సంకేతాలు పంపారు. మంత్రివర్గ విస్తరణలో కెటీఆర్ తోపాటు హరీష్ కు మంత్రి పదవి ఇవ్వటం, ఈటెలను టచ్ చేయకపోవటం కెసీఆర్ రాజకీయ వ్యూహం అమలు పరిచినట్లే కన్పిస్తోంది. ఓ వైపు తెలంగాణలో బిజెపి తరుముకొస్తోంది. మరో వైపు పార్టీలో అసమ్మతి స్వరాలు ప్రారంభం అయ్యాయి. కెటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం అలాంటి చర్చే ఎక్కడా లేదు. ఈ తరుణంలో కెసీఆర్ తానే పదేళ్ళు సీఎంగా ఉంటానని..కెటీఆర్ ను సీఎం చేయబోవటం లేదని తనంతత తానుగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేతలు అయితే కెటీఆర్ కంటే హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కెటీఆర్ తో పోలిస్తే హరీష్ తో వాళ్ళకు యాక్సెస్ ఎక్కువ.

కేవలం వాళ్ళను నమ్ముకుంటే ఇబ్బంది వస్తుంది అని భావించే కెసీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఫిరాయింపుదారులకు కీలక పదవులు ఇస్తూ ‘విశ్వాసపాత్రుల’ను తయారు చేసుకునే పనిలో పడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు పిలిచి పదవులు ఇచ్చిన కృతజ్ణత కొంత అయినా ఉంటుంది కదా అన్నదే ఆయన లెక్క. పాత వాళ్ళు కొంత మంది..కొత్త వాళ్ళు అంతా విశ్వాసంతో ఉంటే తనకు కానీ..తన తనయుడి రాజకీయ భవిష్యత్ కు మరి కొంత కాలం ఢోకా ఉండదన్నది కెసీఆర్ అంచనాగా చెబుతున్నారు. అందుకే ఫిరాయింపులో గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కెసీఆర్ చాలా మాటల తరహాలోనే వాటిని పక్కన పెట్టి ఛాన్స్ ఉన్న అందరినీ లాగేసుకున్నారు.

అయితే రాజకీయ జీవితాలను ఇచ్చిన పార్టీలనే వదులుకున్న నేతలు మరో ఛాన్స్ వస్తుంది అంటే వెనక్కి పోకుండా ఉంటారా?. ఎప్పుడూ అదే విశ్వాసం చూపిస్తారా?. అంటే రాజకీయాల్లో అది సాధ్యంకాదనే చెప్పొచ్చు. కెసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనల్లుడు హరీష్ రావును తృఫ్తిపరచడానికే ఆయన ఈ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చేసిన ప్రకటన అసందర్భంగా, అయోమయంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేయడానికి, మేనల్లుడు హరీశ్‌రావును తృప్తిపరచడానికే వచ్చే రెండు టరమ్ లు తానే సీఎంగా కొనసాగుతానని కేసీఆర్‌ ప్రకటించుకున్నట్లు ఉందన్నారు. విజయశాంతి వాదనలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ..లాజికల్ గానే ఉందని చెప్పొచ్చు.

Next Story
Share it