Telugu Gateway
Telangana

అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి

అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి
X

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఉప ఎన్నికలో హుజూర్ నగర్ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించటమే కాకుండా.బీ ఫాం కూడా అందజేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ఈ ఎన్నికపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సంప్రదింపులు జరుపుతూ గెలుపుకు అవసరమైన వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఈసారి టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతోందని, సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్‌నగర్ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలని అన్నారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను, కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. ఎన్నికల హామీల్లో ఇవ్వని కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. మెట్ట ప్రాంతాలకు కూడా సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నది జలాలను భగీరథ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హుజూర్‌నగర్ ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. వారికి ప్రజా క్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story
Share it