Telugu Gateway
Politics

యాదాద్రి వివాదం..కెసీఆర్ బొమ్మలపై వెనక్కి తగ్గిన సర్కారు

యాదాద్రి వివాదం..కెసీఆర్ బొమ్మలపై వెనక్కి తగ్గిన సర్కారు
X

యాదాద్రి వివాదం సద్దుమణిగింది. సర్కారు ఈ వ్యవహారంపై స్పందించింది. యాదాద్రి దేవాలయంలో దైవ సంబంధ చిహ్నాలే తప్ప..మరే ఇతర చిహ్నాలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె. భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో యాదాద్రి బొమ్మల వివాదం సుఖాంతం అయింది. సీఎం కెసీఆర్ తోపాటు ఇతర నేతల ఫోటోలు కూడా యాదాద్రి దేవాయలంలో చెక్కటం రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. యాదాద్రి దేవాలయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ తో పాటు కారు గుర్తు, తెలంగాణ ప్రభుత్వ పథకాల చిత్రాలు, ఇతర నేతల చిత్రాలు కూడా చెక్కిన సంగతి తెలిసిందే. యాదాద్రి దేవాలయ పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలు..కట్టడాల్లో కొంత మంది నాయకులు, పార్టీల చిహ్నాల ఉండటం పట్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైటీడీఏ ప్రత్యేక అధికారి కిషన్ రావు, ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయితో భూపాల్ రెడ్డి సమావేశం అయి తాజా వివాదంపై స్పందించారు.

ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ, పార్టీల చిహ్నాలు ఎందుకు చెక్కాల్సి వచ్చింది..ఎవరి ఆదేశాల మేరకు ఆ పని చేశారని భూపాల్ రెడ్డి వీరిని ప్రశ్నించారు. శిల్పులే తమ ఇష్టప్రకారం ఈ బొమ్మలు చెక్కారని..తాము బొమ్మలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో తన బొమ్మ ఉండాలని ముఖ్యమంత్రి కూడా కోరుకోరని, కేవలం దేవాలయ విశిష్టతకు, దైవ సంబంధ అంశాలకు మాత్రమే చెక్కడాలు పరిమితం కావాలని సీఎం ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. తక్షణమే నాయకులు, పార్టీల చిహ్నాల బొమ్మలు తొలగించాలని ఆదేశించారు. దీంతో రాజకీయంగా చెలరేగిన బొమ్మల వివాదం సద్దుమణిగినట్లు అయింది. వైటీడీఏ శుక్రవారం ఈ బొమ్మలకు సంబంధించి వితండవాదం చేసింది. వివాదాన్ని మరింత పొడిగించటానికి ఇష్టం లేకనే సర్కారు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. దీనికి తోడు సోమవారం నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్న తరుణంలో విపక్షాలకు ఛాన్స్ ఇవ్వటం ఎందుకనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it