Telugu Gateway
Telangana

కొత్త వివాదంలో కెసీఆర్ సర్కారు

కొత్త వివాదంలో కెసీఆర్ సర్కారు
X

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలో ఏ దేవాలయానికి ఇవ్వనున్న ప్రాధాన్యత ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ దేవాలయానికి ఇఛ్చారు. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అయితే యాదాద్రి ఆలయ ప్రాకారాలపై సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ చిత్రాలను చెక్కటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కెసీఆర్ చిత్రాలే కాదు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గుర్తు కారు...కెసీఆర్ కిట్ పథకాలను కూడా ఇందులో చిత్రీకరించటం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారంగా మారింది. నిజంగానే ఇవన్నీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు తెలియకుండా జరిగాయా?. అలా జరిగితే దీనికి బాధ్యులు ఎవరు?. వారిపై చర్యలు ఉంటాయా?. లేకపోతే కెసీఆర్ ఆమోదంతోనే ఇవన్నీ జరిగితే ఆయన స్పందన ఏంటి?. బహుశా చరిత్రలోనే ఎప్పుడూ ఇలా జరిగి ఉండదు. ఓ గుడి ప్రాంగణంలో ముఖ్యమంత్రి చిత్రాలు..రాజకీయ పార్టీ గుర్తులు...పథకాలు చిత్రీకరించటం ఏమిటి?. ఎందుకీ కొత్త సంప్రదాయం. మరో ఐదేళ్ళ తర్వాతో..ఎప్పుడో టీఆర్ఎస్ సర్కారు వెళ్ళిపోవాల్సిందే కదా?. ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు కూడా దేవాలయాల్లో తమ బొమ్మలు..గుర్తులు పెట్టుకుంటామంటే?. ఎక్కడికి వెళుతున్నాయి ఈ కొత్త సంప్రదాయాలు.

యాదాద్రి దేవాలయంలో కెసీఆర్ ఫోటోలు చిత్రీకరించిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంత వరకూ ఎక్కడా అధికారిక స్పందన వచ్చినట్లు కన్పించటం లేదు?. అంటే ఇది అంతా కెసీఆర్ కు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవాయలాలు కట్టించినవారెవరూ కూడా ఎక్కడా తమ చిత్రాలు కాదు కదా? పేర్లు కూడా పెట్టుకున్న దాఖలాలు లేవు. యాదాద్రి పరిణామాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి కూడా మండిపడుతోంది. కెసీఆర్ తక్షణమే సమాధానం చెప్పాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. యాదాద్రిలో ఏమైనా జరగరానిది జరిగితే దానికి సీఎం కెసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామాలపై మండిపడింది. కాంగ్రెస్ కంటే బిజెపిపైనే ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.

Next Story
Share it