Telugu Gateway
Andhra Pradesh

పార్లమెంట్ లో టీడీపీ కార్యాలయం వైసీపీకి

పార్లమెంట్ లో టీడీపీ కార్యాలయం వైసీపీకి
X

గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో కార్యాలయాన్ని కోల్పోయింది. గతంలో టీడీపీకి కేటయించిన కార్యాలయాన్ని ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి కేటాయించారు. ఆ పార్టీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉండగా..వైసీపీ 22 సీట్లు గెలుచుకోగా..టీడీపీ కేవలం మూడు సీట్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్లమెంట్ ఆఫీసులో వారికి కేటాయించిన కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు.

మొత్తం 15 పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులు కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఉత్వర్వులు జారీ చేశారు. పార్లమెంటులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఐదో నెంబర్‌ గదిని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి కేటా​యించారు. ఎంపీల సంఖ్య ఆధారంగా చేసుకొని పార్లమెంటులో ఈ పార్టీ కార్యాలయాలు కేటాయించారు. పార్టీకి ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ఉంటేనే పార్టీ కార్యాలయాలు కేటాయిస్తారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలవటంతో కార్యాలయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Next Story
Share it