Telugu Gateway
Telangana

తెలంగాణకు కొత్త గవర్నర్..హిమాచల్ కు దత్తాత్రేయ

తెలంగాణకు కొత్త గవర్నర్..హిమాచల్ కు దత్తాత్రేయ
X

సుదీర్ఘ కాలం తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేత డా.తమిళసై సౌందర్‌రాజన్‌ (58) తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు. దీంతో నరసింహన్ సుదీర్ఘ గవర్నర్ ఇన్నింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ముగిసినట్లు అయింది. కొద్ది రోజుల క్రితం వరకూ ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ స్థానంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే తెలంగాణ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా నరసింహను తప్పించారు. తమిళ్ సై ప్రస్తుతం తమిళనాడు బిజెపి చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైద్య వృత్తి నుంచి వచ్చిన తమిళిసై అనతికాలంలోనే బీజేపీ మహిళా అగ్రనేతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్‌2న కుమారి అనంతన్‌, కృష్ణ కుమారి దంపతులకు తమిళిసై జన్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2నే ఆమె జన్మదినం కావడం విశేషం. సౌందర్‌రాజన్‌ మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. మోడీ సర్కారు మొదటి టర్మ్ లో ఆయన్ను మంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారు. తర్వాత లోక్ సభ సీటు కూడా ఇవ్వలేదు. కానీ ఇఫ్పుడు గవర్నర్ పదవి ఇచ్చి దత్తాత్రేయను తాము విస్మరించలేదనే సంకేతం పంపింది బిజెపి అధిష్టానం.

Next Story
Share it